వేరొక సువార్త

ఆర్థర్. డబ్ల్యు. పింక్ అనే ఒక క్యాల్వినిస్ట్ బోధకుడు దేవుడే పాపానికి కర్త అని దేవుడు అందరినీ ప్రేమించడు అని అంటాడని ఇది వరకే మనం ఆధారాలతో చూసాం. ఇప్పుడు దేవుణ్ణి విలన్ చేసి చూపించే ఈ బోధకుడు తన కుహనా పాండిత్యాన్ని తప్పుడు సువార్తను దాచిపెట్టడానికి ఎదుటి వారిని దూషించే ప్రయత్నంలో మిగిలిన వారు ప్రకటించే సువార్త తప్పు అని చెప్పే ప్రయత్నం చేయడం చూద్దాం. ఒకవైపు మనుష్యులను, సాతానును కూడా ప్రేరేపించేది పాపాన్ని తన సార్వభౌమాధికారం లో రచించింది దేవుడే అని చెబుతూ ఇంకో నాలుకతో తూచ్చ్ అంటాడు ఈ బోధకుడు. తను రాసిన పుస్తకంలో, ఒక వైపు పాపంఈ లోకంలోకి దేవుని చిత్త ప్రకారమే వచ్చింది అని చెప్పి, ఇంకో పక్క 'ఇచ్ఛయించుటకును కార్యసిద్ధికలుగజేసికొనుటకును తన దయాసంకల్పము నెరవేరుటకై తన వారిలో కార్యసిద్ధి కలుగజేయువాడు దేవుడేనని' మనం చదువుతాము గదా (ఫిలిప్పీ 2:13). అదే విధంగా “అవిధేయులైన వారిని ప్రేరేపించే శక్తి అపవాదేనని కూడ రాయబడింది (ఎఫెసీ 2:2).” అంటాడు. ఇంతకీ అవిదేయులు అవిదేయులు ఎలా అయ్యారు అని అడిగితే దేవుడే నిర్ణయించాడు అది కూడా తనకు మహిమ కలుగటానికి అంటాడు. మరి వారిని ప్రేరేపించే అపవాది ఎలా ప్రేరేపిస్తున్నాడు అంటే అది కూడా దేవుడే చేయిస్తున్నాడు అనక తప్పదు. ఎందుకంటె ఈయన గారి ఉద్దేశ్యంలో దేవుని సార్వభౌమత్వం అలాంటిది మరి! సులువుగా చెప్పాలంటే ఈ లోకం లోనికి పాపం ప్రవేశించడం అనేది దేవుని చిత్త ప్రకారమే జరిగింది. ఆయన చిత్తం కాకపోతే అసలు పాపమే వచ్చేది కాదు. అది కేవలం ఆయన అనుమతి కాదండోయ్..ఆయన సంకల్పాన్ని సంపూర్ణం చేసే ఆయన నిర్ణయం అది. అంటాడు పింకు. ఈయన సిద్ధాంతానికి నమ్మకంగా ఉండే  ''ధర్మ విరోధ సంబంధమైన మర్మము'' కూడ ఉంది (2 థెస్స. 2:7), సాతాను తన భక్తుల మీద ముద్ర వేయడానికి తన సేవకులను వాడుకుంటాడని వాక్యం చెబుతుంది (ప్రకటన 13:16) కదా ఆ క్రియ, అలాగే సాతాను తెలియజేసే “గూఢ సంగతులను” (ప్రకటన 2:24) సాతాను చెసె అద్భుతకార్యాలు, సూచకక్రియలు (2 థెస్స 2:9) సాతానుకు ఉన్న సింహాసనం (ప్రకటన 2:13) సాతానుకు ఉన్న 'సమాజం' (ప్రకటన 2:9) ''వెలుగు దూత వేషము'' (2 కొరింథీ 11:14) సాతానుకు ఉన్న అపొస్తలులు (2 కొరింథీ 11:13) అన్నీ దేవుని చిత్తానుసారంగా ఆయన జరిగిస్తూ ఆయనే మనలను నరకంలో వేయడానికి గీసిన ముగ్గు అని తేల్చాలి కదా.

నకిలీని సృష్టించడంలో అపవాది మహానిష్ణాతుడు అంటే నకీలను సృష్టించేలా దేవుడే సాతానును ప్రోత్సహించి ఇచ్చయించి తన సువార్తకు దీటుగా ఇంకో నకిలీ సువార్త కూడా దేవుడే రచించి సాతానుకు ఇచ్చి తద్వారా ఆయన ఎన్నుకోని వారిని భ్రమింపజేస్తున్నాడు లేక మోసపరచుచున్నాడు అన్న అర్థం వస్తుంది కదా? క్రీస్తు విత్తిన పొలంలోనే అపవాది కూడ పని చేస్తూ ధాన్యంలా కనబడే గురుగులను మొలిపించి ధాన్యఉత్పత్తిని ఆపాలని అపవాది చేస్తున్న ప్రయత్నం నిజానికి దేవుని ప్రణాళిక మరియు ఆయన జరిపిస్తున్న రహస్య చిత్తము. ఇదే క్యాల్వినిస్తుల బోధ. ఒక్క మాటలో చెప్పాలంటే, దేవుని కార్యాన్ని నిర్వీర్యం చేయడానికి దేవుడే అపవాది ద్వారా ఇంకో సువార్త వ్రాయించాడు. “కాబట్టి క్రీస్తుకు సువార్త ఉన్నట్లే అపవాదికి కూడ సువార్త ఉంది. అపవాది సువార్త క్రీస్తు సువార్తకు నకలు. అపవాది సువార్త నిజసువార్తను దగ్గరగా పోలి ఉంటుంది గనుక దాని వలన అనేకమంది  మోసపోతున్నారు.” అంటాడు పింకు. క్యాల్వినిజం ప్రకారం ఇలా మోసపోవడం దేవుని చిత్తము. ఎందుకంటె ఆయన ఎన్నుకున్న వారిని మాత్రమె పరలోకం తీసుకు వెళ్ళాలి మిగిలిన వారిని రాకుండా ఆపాలి. అదే క్యాల్వినిజం ప్రకారం ఆయన ప్రణాళిక. దేవుడే తన సార్వభౌమత్వంలో ముందుగా నిర్ణయించిన అపవాది సువార్తను గురించి గలతీ పత్రికలో పౌలు ఇలా చెప్పాడు: ''క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచినవానిని విడిచి, భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకాశ్చర్యమగుచున్నది. అది మరియొక సువార్త కాదుగాని, క్రీస్తు సువార్తను చెరుపగోరి మిమ్మును కలవరపరచువారు కొందరున్నారు'' (గలతీ 1:6,7). అయోతే ఇక్కడ చిక్కు ఏమిటంటే పౌలుకు పాపం క్యాల్వినిజం లో ఉన్న ఈ అగోచర మరియు అత్యంత రహస్య మాయ చిత్తం తెలియదు. ఎందుకంటె పౌలు కేవలం అపోస్తాలుడు కదా. అదే పింకు అయితే దేవుని రహస్య చిత్తాన్ని కూడా అవపోసన పట్టిన వాడు. క్యాల్వినిజంలో ఉన్న పైత్యం ఇది. అది కూడా పింకు వంటి వారు చెప్పే క్యాల్వినిజం యొక్క పైత్యం ఇది.

“సాతాను సువార్త విప్లవాత్మక సూత్రాలున్న వ్యవస్థ కాదు. ఇది అరాచకత్వపు పథకం అంతకంటే కాదు. ఇది యుద్ధాన్ని, అల్లకల్లోలాన్ని పుట్టించదుగాని ఐక్యతే దాని లక్ష్యం.” అంటాడు పింకు. అయితే యేసు క్రీస్తు సువార్త యొక్క ప్రముఖ ఉద్దేశ్యం ఐక్యత కాదు అన్నది పింకు గారి వాదనలా ఉంది. “ఇది కుమార్తెకు వ్యతిరేకంగా తల్లిని లేక కుమారునికి వ్యతిరేకంగా తండ్రిని లేపదు. ఇది మానవులంతా 'సహోదరులని' చెబుతుంది.” అన్నట్టుగా క్రీస్తు సువార్త యొక్క ప్రధాన లక్ష్యం గందరగోళం మరియు కుటుంబ కలహాలు మానవ సమాజం యొక్క సహోదరత్వాన్ని భంగపరుస్తేనే నిజమైన సువార్త అని అంటాడు పింకు. మానవుల మధ్య కలహం, అసూయా, వైషమ్యాలు విలువలలో రాజీ ఉండటం వగైరాలు మానవ పతన స్థితికి కారణం అయితే ఆ పతన స్థితి నుండి రక్షించిన యేసు తన స్వరూపమందు మనలను ఎదిగేలా చేసి ఐక్యతను ప్రేమను, సహోదర భావాన్ని మనకు ఇస్తాడు. ఇదే ఆయన స్థాపించే రాజ్యానికి ఉన్న విలువలలో ప్రధాన అంశాలని వాక్యము కూడా చెబుతుంది. యోహాను 17:20. మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు, తండ్రీ, నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున,21. వారును మనయందు ఏకమైయుండవలెనని వారికొరకు మాత్రము నేను ప్రార్థించుటలేదు; వారి వాక్యమువలన నాయందు విశ్వాసముంచువారందరును ఏకమైయుండ వలెనని వారికొరకును ప్రార్థించుచున్నాను.22. మనము ఏకమై యున్నలాగున, వారును ఏకమై యుండవలెనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని.23. వారియందు నేనును నా యందు నీవును ఉండుటవలన వారు సంపూర్ణులుగా చేయబడి యేకముగా ఉన్నందున నీవు నన్ను పంపి తివనియు, నీవు నన్ను ప్రేమించినట్టే వారినికూడ ప్రేమించితివనియు, లోకము తెలిసికొనునట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని.” అని చెబుతూ యేసు పరిచర్య యొక్క ప్రధాన లక్ష్యాలలో ఒకటి ఐక్యత ద్వారా దేవుని మహిమ మరియు లోకము యేసును ఎరుగుట అని ప్రభువే తన ప్రార్థనలో స్వయంగా చెబుతున్నా పింకు మాత్రం తన సువార్త తనదే అంటాడు. మీకా 6:8 లో ఉన్నట్టు రాజ్య విలువలను ఈ లోకం లో చాటడం పింకు ఉదేశ్యంలో వేరొక సువార్త.

   వేరొక సువార్తగా పింకు పేర్కొంటున్న సువార్త “లోకస్థునిని క్రిందికి లాగదుగాని అతన్ని పైకిలేపి అభివృద్ధిపరుస్తుంది. ఇది విద్యను, వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తుంది. ఇది 'మనిషిలోని మంచిని' పురికొల్పుతుంది. ఈ లోకాన్ని కష్టరహితమైన సానుకూల నివాసంగా మలిచి క్రీస్తు లేని వెలితిని దేవుని అవసరతను గుర్తెరగకుండేలా చేయడమే దీని ప్రధానలక్ష్యం.” అంటాడు పింకు. కానీ పింకు కు అర్థం కాని విషయం ఏంటంటే ఆదికాండం 2వ అధ్యాయంలో దేవుడిచ్చిన ఆశీర్వాదంతో కూడిన ఆజ్ఞ “ఫలించడం, విస్తరించడం, భూమిని నిండించడం మరియు దానిని లోబరచుకోవడం మానవులందరికీ” అని అలాగే ఆ పనిని చేయడానికి దేవుని స్వరూపం మరియు పోలికలో ఉన్న మనుష్యులు “సాగు చేయాలి మరియు సంరక్షించాలని” ఆది కాండం 2:15 లో మనం చూస్తాం. ఇది క్రైస్తవ ప్రపంచ దృక్పదానికి పునాది వంటి వాక్య భాగం. క్రైస్తవ జీవితం మత పరమైనది మాత్రమె కాదు అని చచ్చి పరలోకం పోతే చాలు అనుకునేది కాకుండా ఈ లోకాన్ని ఆయనిచ్చిన వనరులను శత్రువు మిత్రుడు అన్న తేడా లేకుండా ఆయన రాజ్య ప్రతినిధులుగా క్రమముగా సాగుచేసి సంరక్షించడం మన బాధ్యత అన్నది యుదా క్రైస్తవ దృక్పదం. కనుకనే చావడానికన్నా జీవితానికి ఎక్కువ విలువ, ఆరాధన భావం చూపిస్తారు క్రైస్తవులు. అందుకే మనుష్యుల జీవితాలలో (వారు ఎలెక్ట్ అయినా కాకపోయినా, విశ్వాసి అయినా కాకపోయినా) వెలుగు నింపడానికి దేవుడిచ్చిన జ్ఞానాన్ని ఉపయోగించి నూతన ఆవిష్కరణలు చేస్తుంది యుదా క్రైస్తవ సమాజం. దీన్ని దేవుడిచ్చిన బాధ్యతగా గుర్తిస్తాం మనం. అంతే కానీ అలా కష్టపడే వారు, మంచిని ప్రోత్సహించే వారు ఈ లోకాన్ని ప్రేమించి దేవుణ్ణి విడిచేందుకు లేక క్రీస్తు లేమిని గుర్తెరగకుండా ఉండటానికి ఇవన్నీ చేస్తారు అనడం పింకు గారికి ఉన్న అవగాహనా లోపం లేక మతచాందస వాదం అనాలేమో. లోకానికి మేలు చేస్తే దేవుణ్ణి విడవటం అనేది ఒక హేత్వాభాస. రెండిటినీ కలిపి జీవించడమనే క్రైస్తవ జీవన విశ్వాసం కూడా ఒక వికల్పం కదా.?

 ఇదే తరహా ఏదో ఒక వికల్పాన్నే ఎంచుకోవాలి అనే భ్రమను పుట్టించే ప్రయత్నంలో పింకు గారు ఇలా అంటారు: “ఈ సువార్త “త్యాగం, దాతృత్వం వంటి సూత్రాలను ప్రకటిస్తూ ఇతరుల కోసం జీవించాలని, అందరికీ దయ చూపాలని బోధిస్తుంది. ఇది శరీరానుసారమైన మనస్సును ఆకర్షిస్తుంది గనుక అనేకమందికి నచ్చుతుంది. ఎందుకంటే మనిషి పాపంలో మరణించాడని, నిత్యజీవము నుండి వేరుపరచబడ్డాడని, అతడు తిరిగి జన్మిస్తేనే నిరీక్షణ ఉందనే సత్యాన్ని ఇది విస్మరిస్తుంది. సత్క్రియలు రక్షణ యొక్క ఫలితం అన్న దేవుని నియమానికి భిన్నంగా, సత్క్రియల వలన రక్షణ కలుగుతుందని ఇది ప్రకటిస్తుంది. ఇది యోగ్యత వలనే నీతిమంతులౌతారని బోధిస్తుంది. 'మంచి చేయు, మంచిగా జీవించు' అనేది దీని నినాదం. కాని ఇది మనిషిలో మంచి లేదనే సత్యాన్ని ప్రకటించదు. ఇది 'మంచి నడవడి రక్షణ యొక్క ఫలం' అని చెప్పే దేవుని వాక్యానికి వ్యతిరేకంగా 'మంచి నడవడి వలన రక్షణ కలుగుతుందని' ప్రకటిస్తుంది.” ఆయనే హేత్వా భాస చేసి ఆయనే దానికి విరుగుడు కూడా ప్రతిపాదిస్తున్నారు. ఇక్కడ ఆయన విస్మరించేది ఏంటంటే క్యాల్విన్ గారి సిద్ధాంతాలను మోస్తున్న ఈ పింకు గారు దేవుని సార్వభౌమత్వంలోనే మనుష్యులు ఈ మంచి పనులన్నీ చేస్తున్నారు అన్న వారి స్వంత దృక్పదం. నిజానికి క్రైస్తవ దృక్పదంలో అనేకులను ఆకర్షించేది దేవుని ప్రేమ, ఆయన ప్రేమను కనబరచే క్రైస్తవ సమాజం. యేసు మత్తయి సువార్తలో కొండ మీది ప్రసంగం లో చెప్పినట్టు మన సత్క్రియలను చూచి పరలోకమందున్న తండ్రి మహిమ పరచబడాలి అన్నది మన రక్షించబడ్డ జీవితానికి ఉన్న ఉద్దేశ్యాలలో ఒకటి. అంతేగానీ ఏ క్రైస్తవుడు తన సువార్త లో ఇలా జీవిస్తే ఆయోగ్యత కారణంగా రక్షించబడతారని చెప్పదు. ఇది కేవలం పింకు గారు ఊహలో నుండి పుట్టి తనతో ఏకీభవించని వారిని తప్పుడుగా చిత్రీకరించడానికి చేసిన ప్రయత్నం మాత్రమె. ఏమయ్యా అని అడిగితే ఇది కూడా దేవుడే నిర్ణయించాడు కాబట్టి చేసాను అంటారో ఏమో?

పింకు గారు ఇంకో వితండవాదం చేస్తారు: “అపవాది అపొస్తలులు సారా దుకాణ నిర్వాహకులో లేదా వేశ్యావర్తకులో కాదు కాని అధికశాతం సంఘంలోని దుర్బోధకులే.” “క్రీస్తు యొక్క అపొస్తలుల వేషము ధరించుకొనువారైయుండి, దొంగ అపొస్తలులును మోసగాండ్రగు పనివారునైయున్నారు. ఇది ఆశ్చర్యము కాదు. సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు గనుక వాని పరిచారకులును నీతిపరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతి కాదు వారి క్రియల చొప్పున వారికంతము కలుగును” (2 కొరింథీ 11:13-15) అంటూనే ఇది దయ్యముల బోధ అంటూనే ఇంకో పక్క ఇలాంటి వారు కూడా నిర్ణయింపబడినవారైతే వారు కూడా విశ్వాసము నుండి తొలగిపోరు అంటాడు. వీరి బోధ దయ్యముల బోధ అయినాకానీ వయు బోధ నండి తొలగిపోతారు కానీ యేసును సొంత రక్షకుడు అని నమ్మే విశ్వాసము నుండి తొలగిపోరు అంటాడు. కారణం ఏంటి అంటే క్యాల్వినిజంలో సంబద్ధత కోసం ఒకసారి రక్షింపబడినవారు జీవితాంతం వారి బోధకు, పాపానికి, వెలుగు దూతకు సంబంధం లేకుండా ముందే నిర్ణయించబడ్డారు కాబట్టి పరలోకం పోతారు అంటాడు.

ఒక వైపు ఈ అసంబద్ధ సువార్త ప్రకటిస్తూ ఇంకో వైపు “నకిలీ నాణెము అసలు నాణానికి ఎంత దగ్గరగా పోలి ఉంటే మోసపరచడం అంత సులభమౌతుంది. అలాగే దుర్భోధ  అనేది సత్యాన్ని వ్యతిరేకించటం కాదు, దానిని వక్రీకరించటమే కనుక సత్యతిరస్కారం కన్నా పాక్షిక అబద్ధమే అత్యంత అపాయకరం.” అంటారు పింకు గారు. అయితే పింకు గారు దేవుని ప్రేమను, ఆయన క్షమాగుణాన్ని, ఆయన బలియాగాన్ని, ఆయన సార్వభౌమత్వాన్ని, ఆయన వ్యాజ్యమాడదాం రండి అని పిలిచే పిలుపును, ఆయన మనుష్యుల పట్ల కలిగి ఉన్న జాలిని, మనుష్యులు దేవునికి అనుకూలంగా స్పందించగల సామర్థ్యాన్ని, సువార్తకున్న కృపాశక్తిని - వెలుగునిచ్చే గుణాన్ని, ఆయనలో ఉన్న పక్షపాతములేని గుణాన్ని, ఆయన ఆలోచనలలో కూడా పాపానికి తావు లేదు అనే సత్యాన్ని వక్రీకరించడం ద్వారా క్రీస్తు విరోధ సువార్త చెబుతున్నాడు అన్న సత్యాన్ని తన మాటలలో ఒప్పుకున్తున్నట్టుగా స్పష్టం అవుతోంది.

''యేసు క్రీస్తునందు మీరందరు విశ్వాసము వలన దేవుని కుమారులైయున్నారు'' (గలతీ 3:26), ''తన నామమునందు విశ్వాసమునుంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను'' (యోహాను 1:12) అని లేఖనాలు స్పష్టంగా చెబితే, పింకు గారు మాత్రం దేవుడు మనుష్యులందరికీ విశ్వసించే అవకాశమే ఇవ్వకుండా ఆ సామర్థ్యమే ఇవ్వకుండా కొందరినే తోలు బొమ్మల్లా ఎన్నుకున్నాడు అని ప్రకటిస్తాడు. అంతేగాక ''ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడనియెడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను'' (ప్రకటన 20:15) అని వాక్యం చెబితే చూసారా దేవుడు కొందరు మనుష్యులను నరకానికి పంపదానికే సృష్టించుకున్నాడు అంటాడు.

దేవుని స్వరూపియైయున్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత (సాతాను) అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసెను. అని వాక్యం చెబితే దేవుడే వారికి చూసే అవకాశం లేకుండా వారిని సృష్టి ఆరంభం ముందే నిర్ణయించాడు అని పింకు గారు అంటారు. వీరి ఉద్దేశ్యంలో కేవలం గ్రుడ్డితనమే కాదు అసలు మనుష్యులు చచ్చిన వారు వారిని అలా దేవుడే తన చిత్తం చొప్పున చేసాడు. ''మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడియున్నారు. ఇది మీ వలన కలిగినది కాదు దేవుని వరమే'' (ఎఫెసీ 2:8) అని వాక్యం చెబితే విశ్వాసం కూడా దేవుడే ఇవ్వాలి అని వక్రీకరించి మనుష్యులకు దేవుని దూషించేందుకు ఆస్కారం వారి బాధ్యతనుండి తప్పించుకునేందుకు అవకాశం ఇచ్చేలా వేరొక సువార్త చెబుతారు పింకు గారు. అంతే కాక ''మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే...మనలను రక్షించెను'' (తీతుకు 3:5) అనే దేవుని వాక్యం ఉపయోగించి అసలు నువ్వు విశ్వపింపలేవు అని అంటారు పింకు గారు.

ఇప్పుడు ఈ వ్యాసం చదివే నువ్వు ఎక్కడ నిలబడ్డావు? ఎందుకంటె ఎక్కడ నిలబడాలి అనేది నీ నిర్ణయం. సరియైనదిగా కనబడినప్పటికీ మరణానికి దారితీసే మార్గంలో నిలబడ్డావా? లేక జీవానికి నడిపించే ఇరుకుమార్గంలో ఉన్నావా? ఎందుకంటె మంచి చెడుల విచక్షణ ప్రభువు నీకిచ్చాడు. నీ థియాలజీ దేవుణ్ణి ద్వేషించేవాడిగా చూపిస్తోందా? నువ్వు దేవుని చేత అంగీకరింపబడటానికి కేవలం యేసు రక్తముపై, ఆయన నీతిపై ఆధారపడుతున్నావా? లేక విశ్వాసము అవసరం లేని దేవుని ఎన్నిక అనే అబద్ధం పై ఆధార పడుతున్నావా? అంతరంగం లో దేవుడు ఎన్నుకునేసాడు అన్న అబద్ధం నమ్మి మారుమనస్సు లేక, విశ్వాసం లేక, దైవభక్తి లేక, బాప్తిస్మము అవసరము లేదంటూ, ప్రభువు బల్ల మొదలైనవాటిలో నిన్ను నువ్వు సరిచూసుకొనక, గౌరవ ప్రదంగా ప్రభువును నీ సాక్షి జీవితం ద్వారా హెచ్చించకుండా, లాంఛనప్రాయంగా సంఘాలకు హాజరయ్యి సంఘములోని మిగిలినవారు ఎన్నికలో లేరు నేనొక్కన్నే ఎన్నుకోబడ్డాను లేక నా డినామినేషనే ఎన్నుకోబడ్డది అన్న అహంకారంతో ఉన్నావేమో సరిచూసుకో. మన ఉద్దేశాలు ఎంత మంచివైనా, మన కారణాలు ఎంత గొప్పవైనా, మన భావాలు ఎంత సహేతుకమైనవైనా, మన ప్రయత్నాలు ఎంత యథార్థమైనవైనా, దేవునికుమారుడిని అంగీకరించకపోతే దేవుడు మనల్ని తన కుమారులుగా అంగీకరించడు. ఆయనను విశ్వాసముతో అంగీకరించక తప్పదు. నీ సామర్థ్యంతో నిన్ను రక్షించుకోలేవు అని చేతులెత్తేయడం నీ ఘనత లేక రక్షణలో నీ భాగస్వామ్యం కానే కాదు. అలా అనుకోవడం పింకు గారి లాంటి వారు చెప్పే అబద్ధం.

సాతాను సువార్తలో లేక పింకు గారి లాంటి వారు ప్రకటించే వేరొక సువార్తలో నమ్మశక్యంగా కనిపించే మరొక కోణం ఏమిటంటే, క్రీస్తు ప్రాయశ్చిత్తమరణాన్ని ప్రభోదించటానికి నడిపించి, దేవుడు వారి నుండి కోరేదల్లా కేవలం తన కుమారునిపై విశ్వాసముంచటమేనని చేసే ప్రకటన తత్ఫలితంగా మారుమనస్సు పొందడం కంటే కూడా మీరేమి చేయాల్సివ అవసరం లేదు దేవుడు మిమ్మును సృష్టి ఆరంభం నుండే ప్రత్యెక మైన ప్రేమతో మిమ్మల్నే ప్రేమించి మీకోసమే పరలోకం చేసి ఉంచాడు కాబట్టి మీరు రక్షింపబడ్డారని చెప్పి అనేకులను మోసపుచ్చుతారు. ''మారుమనస్సు పొందనియెడల మీరందరును అలాగే నశింతురు'' అని యేసు చెబుతుంటే (లూకా 13:3) ''మారుమనస్సు పొందటం'' అంటే పాపాన్ని ద్వేషించి దాని విషయమై దు:ఖపడి దాని నుండి వైదొలగటమే, ఇది పరిశుద్ధాత్ముడు మనలో విరిగి నలిగిన హృదయానుభవాన్ని పుట్టించటం వలన కలుగుతుంది అంతేగానీ మీరు చేసేది కాదు, అని చెప్పి క్రీస్తు రక్షణ కార్యం జరగకుండా మనుష్యుల బాధ్యతను విస్మరించేలా చేయడం ఈ వేరొక సువార్తకున్న ప్రత్యేకత. ప్రజలు పింకు గారి సువార్త పుణ్యమా అని యేసును 'ప్రభువుగా' అంగీకరించకుండానే ఆయన్ని 'వ్యక్తిగత రక్షకునిగా' అంగీకరించకుండానే దేవుని కుమారుడు తన ప్రజలను పాపములో కొనసాగేలా రక్షించటానికి రాలేదు కాని, ''వారి పాపముల నుండి'' వారిని విడిపించి రక్షించడానికి వచ్చాడు (మత్తయి 1:21) అన్న విషయం మరిచి పోయి నాకు కృప వచ్చేసింది నేను ఎంత పాపంలో బ్రతికినా పరలోకం పోతాను అనే దుర్వార్తను నమ్మేసి అలా బ్రతికేస్తున్నారు. దేవుని అధికారానికి లోబడి, ఆయన ఆధిపత్యాన్ని అంగీకరించి, ఆయన ఏలుబడికి మనల్ని మనం సమర్పించుకోవడము కూడా దేవుని ముందు నిర్ణయం లో ఉంటె చేస్తాం లేక పోతే లేదు అనే దౌర్భాగ్యపు బాధ్యతా రాహిత్య వార్త సువార్త ఎలా అవుతుంది. క్రీస్తు ''కాడిని'' ఎన్నడూ ఎత్తుకోకుండా అన్ని విషయాల్లోనూ ఆయనను సంతృప్తిపరచాలని చూడకుండా నాకా సామర్థ్యం లేదు దేవుడే నిర్ణయిస్తే చేస్తాను అనుకునే వారు సాతాను చేత మోసగింపబడుతున్నవారే. అవును ప్రియ మిత్రమా! ఎన్నుకోబడ్డాను అన్న భ్రమ లో క్రీస్తు నామంలో సేవ చేస్తూ ఆయన నామంలో ప్రసంగిస్తూ సంఘంచేత గుర్తింపు పొంది లోకం చేత గుర్తెరుగబడి కూడా విశ్వాసము, పశ్చాతాపము, మారుమనస్సు క్రీస్తుతో రోజు వారీ నడక లేకుండా క్రీస్తు చేత ఎరుగబడకుండటం సాధ్యమే.

“కాబట్టి మనమెక్కడున్నామో తెలుసుకోవడం, విశ్వాసంలో ఉన్నామో లేదో పరీక్షించుకోవటం, వాక్యం చేత మనల్ని మనం బేరీజు వేసుకోవటం, శత్రువు చేత మనము మోసగించబడుతున్నామో లేదో వివేచించుకోవటం మరియు మన జీవితాన్ని ఇసుకపై నిర్మిస్తున్నామా లేక క్రీస్తు అనే బండపై కడుతున్నామా అని పరీక్షించుకోవటం ఎంతో అవసరం.” అని పింకు గారే చెప్పారు. క్యాల్వినిస్టు సిద్ధాంతానికి దానిని ఆపాదించుకుని ఉంటె ఎంత బాగుండేది? మనమైనా అలా జాగ్రత్తగా ఉండేందుకు ప్రయత్నిద్దాం. ప్రభువు మిమ్మును ఆశీర్వదించును గాక.

Share