క్రైస్తవుని జీవన శైలిలో రోజువారి జీవనం కొరకు పోరాడడం కంటే, జీవితంలో సాధించే వాటిని గూర్చిన ఆలోచనలు ఎంతో గొప్పవిగా ఉంటాయి. చేసే ప్రతి పనిలో దేవుణ్ణి ముందు పెట్టుకొని ఆ పనిని ప్రారంభించగలిగితే తప్పకుండా విజయలు పొందుతూ ఉంటాము. కొన్ని సార్లు అపజయాలను ఎదుర్కొనే పరిస్థితి మనకు ఎదురవుతుంది, కారణం..మనలోని బలహీనతలే. క్షుణ్ణంగా ఆలోచిస్తే మన బలహీనత మన ప్రత్యర్థి, దానిని జయించగలిగేది మన లక్ష్య సాధన కొరకైన ప్రోత్సాహం. ఈ ప్రోత్సాహం మనలను బలహీనతలనుండి బలవంతులను చేస్తుంది.
నాకు చాలా అనుభవం ఉంది నేను చేసేదే సరైనది అనే ఆలోచనలు మనలను కొన్ని సార్లు నిరాశలు కలుగజేస్తాయి. ఎందుకంటారు? మన సొంత నిర్ణయాల వల్ల లేదా ఎవరో చూస్తున్నారని చేసే పనుల వల్లనో లేదా మనుష్యుల మెప్పులు పొందాలని చేసేవన్నీ దేవుని నుండి ప్రతిఫలం పొందలేవు. మనకెంత అనుభవం ఉన్నా ప్రతి విషయంలో అన్నటికంటే ముందు ఆ దేవుడు ఉంటేనే ప్రతిఫలం పొందగలం.
ఇదిలా ఉంటే, రేపేమి సంభవించునో అని ప్రతిక్షణం చింతిస్తుండే వారు ఏమి సాధించలేక పోగా ప్రస్తుతం చేస్తున్న పనిలో ఏకాగ్రత కోల్పోయి నష్టపోతుంటారు. నేను ఏది చేసిన విజయం పొందలేకపోతున్నానను నిరాశ మనం కృంగిపోయేలా చేసి అపజయాలపాలు చేస్తుంది. అనేకసార్లు మనకు సంబంధంలేని విషయాల్లో జోక్యం చేసుకొని వాటిగురించి చింతిస్తూ ఉండే సందర్భాలు ఎన్నో ఉంటాయి. ఏదేమైనా మనం నాయకత్వం చేయలేని విషయాల్లో లేదా దానివల్ల మనకేమి లాభం దొరకదు అనే విషయాల్లో మన దృష్టిని కేంద్రీకరించి మనసుపెట్టి పని చేయలేనప్పుడు... జరగని వాటిని గూర్చి లేదా ఏమి జరుగుతుందో; అనే చింతలో కూర్కుకుపోవడం కంటే దేవునిపై దృష్టి సారించి, చేస్తున్న పనిలో ముందుగా అయన చిత్తాన్ని యెరిగి చేసినట్లయితే విజయం మనదే అవుతుంది.
రేపేమి సంభవించునో అనే చింత, మరియు నా జీవితంలో నేను చేరుకోవాలనే లక్ష్యం; ఈ రెంటిలో చాలా వ్వత్యాసం ఉంది. యేసు క్రీస్తు ఈ లోకంలో జీవించినప్పుడు మనకు బోధించిన విషయాలు గమనిస్తే మనం అన్నిటికంటే ముందు ఆలోచన చేయవలసింది అయన నీతిని రాజ్యాన్ని వెదికే వారంగా ఉన్నామా లేదా?. మనం చేసే ప్రతి పనిలో, చేయబోయే ప్రతి పనిలో, మన కుటుంబం లేదా ఉద్యోగం లేదా వ్యాపారం వీటన్నిటికంటే ముఖ్యంగా దేవునికే ప్రాధాన్యత ఇచ్చే వరంగా ఉన్నప్పుడే ప్రత్యేకమైన క్రెస్తవ జీవనశైలి పొందగలం. ఇట్టి విషయాల్లో విజయం పొందాలంటే ప్రార్ధనే మన ఆయుధం. ప్రార్ధించాము అనగానే సరిపోదు గాని, ప్రార్ధించి జవాబు వచ్చేంత వరకు ప్రయత్నం చేయాలి. దేవుని వైపు మన ఆలోచనలను మార్చుకొని ఇట్టి విజయాలను సాధిస్తూ అడుగులు ముందుకువేద్దాం.